కాకినాడ అర్బన్ మండలం రమణయ్యపేట సర్వే నెంబర్ 127/4లో ఉన్న రూ.15 కోట్ల విలువైన మున్సిపల్ కార్పొరేషన్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు జరిగిన కుట్రపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి, ఆమె భర్త మేకా రాహుల్ చౌదరి, మున్సిపల్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ ఏడాది జనవరి 8న ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.

ఈ వివాదానికి సంబంధించి 2015లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాఖలు చేసిన కౌంటర్‌లో, సదరు స్థలాలు ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించినవని స్పష్టం చేశారు. అయితే, ఈ ఏడాది జనవరిలో అధికారులు తమ వాదనను మార్చుకుంటూ, ఆ భూమిపై ఎలాంటి హక్కులు కోరబోమని విరుద్ధమైన అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ పరిణామంపై జయేంద్ర నగర్ నివాసితుల సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి గతంలో పిటిషనర్ల తరఫున పనిచేశారని, ప్రస్తుతం ఆమె భర్త రాహుల్ చౌదరి అదే పిటిషనర్ల తరఫున వకాలత్ దాఖలు చేశారని కోర్టు గుర్తించింది. మోసం, కుమ్మక్కు మరియు ప్రయోజనాల ఘర్షణ వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జస్టిస్ నూనెపల్లి హరినాథ్ వ్యాఖ్యానించారు.

ఈ మొత్తం వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఐజీ స్థాయికి తగ్గని అధికారి పర్యవేక్షణలో విచారణ జరిపి, 12 వారాల్లోగా నివేదికను సమర్పించాలని ఏసీబీ డీజీని కోర్టు నిర్దేశించింది.