అర్నాబ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనిని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ సిబ్బందిని ఏపీకి పంపారు.
TG NPDCL సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పర్యవేక్షణలో మొత్తం 1,127 మంది అధికారులు, సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరు 114 ప్రత్యేక బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. తుఫాను వల్ల కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు.
అమలాపురం, రాజోలు, ద్రక్షరామం, రామవరం, భీమవరం, ఐనువోలు, నరసాపురం, కత్రెనికోన, ముమ్మిడివరం, నడికుడి, అంబాజిపేట వంటి ప్రాంతాల్లో ఈ బృందాలు సేవలు అందిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, ప్రజలకు త్వరగా విద్యుత్ అందించేందుకు సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పనులను వేగవంతం చేసేందుకు అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తూ ఆయన పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
కష్టకాలంలో తెలంగాణ విద్యుత్ సిబ్బంది అందిస్తున్న సహకారంపై ఏపీ ప్రజలు, అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సోదరభావానికి, మానవ విలువలకు ఈ సహాయం నిదర్శనమని వారు పేర్కొన్నారు. విపత్తు సమయంలో ఇలాంటి పరస్పర సహకారం రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.








