తెలంగాణలో నిరుద్యోగుల కోసం టీజీఎస్ఆర్టీసీ కొత్తగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆర్టీసీ యాజమాన్యం సిద్ధాంతాలు పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను పదో తరగతిలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా భర్తీ చేయాలని నిర్ణయించారు.
సాధారణంగా ఆర్టీసీ నియామకాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించే ఆనవాయితీ ఉంది. అయితే, ఈసారి కండక్టర్ పోస్టుల భర్తీ బాధ్యతను నేరుగా ఆర్టీసీ యాజమాన్యానికే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై శుక్రవారం స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత టీజీఎస్ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను ఇప్పటి వరకు రెగ్యులర్‌గా భర్తీ చేయలేదు. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ సహా పలు రీజియన్లలో తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించారు. ఇప్పుడు ప్రభుత్వ ఆమోదంతో 1500 మందిని నియమించేందుకు సంస్థ సమాయత్తమైంది.
నియామకాల్లో పదో తరగతి మార్కులే ప్రమాణం కావడంతో, మార్కులు, గ్రేడ్ పాయింట్ల మధ్య తలెత్తిన సందేహాలను పరిష్కరించే పనిలో యాజమాన్యం ఉంది. ఈ విషయమై ఎస్ఎస్‌సీ బోర్డుకు లేఖ రాసి, గ్రేడింగ్‌ను మార్కులుగా ఎలా మార్చాలో స్పష్టత కోరింది. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.







