విజయవాడ డివిజన్ ఉద్యోగి ఎం.రమేష్ బాబు జూన్ 2న మధ్యాహ్నం 12.05 గంటలకు విధుల్లో ఉండగా, చీరాల స్టేషన్ గుండా వెళ్తున్న గూడ్స్ రైలులో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. రైలులోని రెండు వ్యాగన్లకు ఉన్న ఐరన్ కాయిల్స్ ఇనుప పట్టీలు విరిగిపోయి ఉండటాన్ని ఆయన గమనించారు.

వెంటనే స్పందించిన రమేష్ బాబు, లోకోపైలెట్, స్టేషన్ మాస్టర్ మరియు కంట్రోల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో రైలును వేటపాలెంలో నిలిపివేసి, ప్రమాదం జరగకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. ఈ అప్రమత్తతకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది.

విశాఖపట్నంలోని జోనల్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో, జోన్ వ్యాప్తంగా విధుల్లో అత్యంత అప్రమత్తత చూపిన ఇతర ఉద్యోగులకు కూడా అవార్డులను అందించారు. దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యర్ చేతుల మీదుగా రమేష్ బాబు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.