పటాన్ చెరువు నుంచి వెళ్తున్న 218 నంబర్ ఆర్టీసీ బస్సులో మిధాని డిపోకు చెందిన కండక్టర్ శేఖర్, డ్రైవర్ జె.ఎస్.కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో బస్సు ఎక్కిన మైనారిటీ గురుకుల విద్యార్థిని ఆందోళనగా ఉండటాన్ని కండక్టర్ గమనించారు. ఆమె చేతిలో పది రూపాయలు తప్ప చెప్పులు కూడా లేకపోవడంతో సిబ్బందికి అనుమానం కలిగింది.

బాలిక ప్రవర్తనపై నిఘా ఉంచిన కండక్టర్, తోటి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేశారు. ఆమె పక్క ప్రయాణికుడి ఫోన్ తీసుకుని ఎవరితోనో మాట్లాడటాన్ని బట్టి, ఆమె మైనారిటీ గురుకుల విద్యార్థినిగా సిబ్బంది గుర్తించారు. బాలిక మానసిక ఆందోళనలో ఉందని గ్రహించి, ఆమెపై ప్రత్యేక దృష్టి సారించారు.

కండక్టర్ ఊహించినట్లుగానే, వేగంగా వెళ్తున్న బస్సు నుంచి ఆ బాలిక దిగిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు, సిబ్బంది ఆమెను వెనక్కి లాగి రక్షించారు. అనంతరం ఆమెను సురక్షితంగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందించారు. ఆర్టీసీ సిబ్బంది చూపిన చొరవను ప్రశంసిస్తూ ఆయన పోస్ట్ చేశారు.