విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే యువతకు ప్రయాణ ఖర్చులు, వీసా ఫీజులు, భాషా శిక్షణ వంటి ఆర్థిక భారాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురానుంది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 6 వేల మందికి విదేశీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ పథకం కింద అర్హులైన అభ్యర్థులకు మొత్తం వ్యయంలో 50 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ అందనుంది. గల్ఫ్ దేశాలు, సింగపూర్, మలేషియా, ఫిజీ, మారిషస్, ఇజ్రాయెల్ వెళ్లే వారికి గరిష్టంగా రూ. 50 వేలు, జర్మనీ, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి దేశాలకు వెళ్లే వారికి రూ. 1.75 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదించారు. మిగిలిన మొత్తాన్ని అభ్యర్థులు సొంతంగా లేదా బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, తెలంగాణలో స్థానికులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను నిర్వహించి, జిల్లా స్థాయిలో పత్రాల పరిశీలన, క్షేత్రస్థాయి ధృవీకరణ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీ తుది ఆమోదం తెలపనుంది. అభ్యర్థి విదేశాల్లో ఉద్యోగంలో చేరినట్లు నిర్ధారణ అయ్యాక, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను అరికట్టేందుకు ఈ పథకంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోని ఆరోగ్య, నిర్మాణ, లాజిస్టిక్స్ రంగాల్లో ఉన్న డిమాండ్‌ను రాష్ట్ర యువతకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం అధికారికంగా ఈ పథకాన్ని ప్రకటించిన తర్వాతే పూర్తి మార్గదర్శకాలు, దరఖాస్తు తేదీలు వెల్లడి కానున్నాయి.