మైదుకూరు మండలంలోని జీవి సత్రం హైస్కూల్‌లో స్మార్ట్ కిచెన్ (ఆహారం వండే ఆధునిక వంటగది) నిర్వాహకుల నిర్లక్ష్యం బయటపడింది. భోజనం వడ్డించే సమయంలో పప్పులో పడిన బల్లిని సిబ్బంది గమనించకుండానే విద్యార్థులకు వడ్డించారు.
ఆ కలుషిత ఆహారం తిన్న ముగ్గురు విద్యార్థులు వెంటనే వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా పాఠశాల యాజమాన్యం జాగ్రత్త పడింది. బయటి ఆసుపత్రికి తరలించకుండా, పాఠశాల వద్దకే వైద్యులను పిలిపించి చికిత్స చేయించారు.
గత రెండేళ్లుగా ఇదే పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, పాఠశాల సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
పేద విద్యార్థుల ఆరోగ్యాలతో ఇలా ఆటలాడుకోవడంపై నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఉద్దేశించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పదేపదే జరుగుతున్న ఈ ఘటనల నుంచి పాఠశాల యాజమాన్యం ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.








