తెలంగాణ అంతటా కృత్రిమ పనీర్ తయారీ, నిల్వ, రవాణా మరియు విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. సెప్టెంబర్ 10 నుండి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఏడాది పాటు ఈ నిషేధం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
సాంప్రదాయకంగా పనీర్ అంటే పాలతో తయారయ్యే ఉత్పత్తి. అయితే, వెజిటబుల్ ఫ్యాట్స్ (వనస్పతి వంటి కొవ్వులు), ప్రోటీన్లు లేదా ఇతర రసాయనాలతో తయారు చేసిన అనలాగ్ లేదా నాన్-డైరీ పనీర్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
ఆహార నాణ్యతను పర్యవేక్షించే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 30(2)(a) ప్రకారం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. సెప్టెంబర్ 10న వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 807 ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ నిషేధం పనీర్ తయారీ, ప్యాకింగ్, పంపిణీ మరియు అమ్మకాలకు వర్తిస్తుంది. పనీర్‌ను ఎక్కువగా వాడే హోటళ్లు, రెస్టారెంట్లు, డెయిరీ సంస్థలు మరియు ఫుడ్ అవుట్‌లెట్లపై ఆహార భద్రతా శాఖ నిఘాను పెంచనుంది.
నిబంధనలను ఉల్లంఘించే తయారీదారులు, సరఫరాదారులు మరియు విక్రేతలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పనీర్ పేరుతో జరుగుతున్న ఈ కృత్రిమ విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.








