ఏపీలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే 'నేతన్న భరోసా' పింఛన్ పథకం దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇప్పటివరకు దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా సమర్పించాల్సిన బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ నిబంధనను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత-జౌళి శాఖల మంత్రి సవిత అధికారికంగా ప్రకటించారు.
చాలా మంది మాస్టర్ వీవర్స్ (చేనేత కార్మికులకు పని ఇచ్చే యజమానులు) తమ దగ్గర పనిచేసే వారికి వేతనాలను బ్యాంకు ఖాతాల ద్వారా కాకుండా నేరుగా నగదు రూపంలో చెల్లిస్తున్నారు. దీనివల్ల కార్మికులు బ్యాంకు స్టేట్‌మెంట్లను సమర్పించలేక పింఛన్ల కోసం దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, కార్మికుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై నేతన్న భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు బ్యాంకు స్టేట్‌మెంట్‌కు బదులుగా, తమ మాస్టర్ వీవర్ ఇచ్చే ధ్రువీకరణ పత్రంతో పాటు వేతన వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. ఈ మార్పుతో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులకు ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి.
రాష్ట్రంలోని 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్ అందజేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. అర్హత ఉన్న ప్రతి నేతన్నకూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్షేమ ఫలాలు అందుతాయని ఆమె స్పష్టం చేశారు.








