హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్‌లో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ (ఉద్యోగ సంఘాల ఉమ్మడి కార్యాచరణ కమిటీ) నేతలతో సమావేశమయ్యారు. పీఆర్సీ (ఉద్యోగుల వేతన సవరణ కమిషన్), పెండింగ్‌లో ఉన్న డీఏలు (ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం), సీపీఎస్ (పాత పెన్షన్ విధానం రద్దు చేసి కొత్తగా తెచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల విడుదలపై చర్చలు జరిగాయి.

ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుతో పాటు టీజీవో, టీఎన్జీవో, పీఆర్టీయూ, ఎస్టీయూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, పీఆర్సీ నివేదిక తెప్పించుకోవడం మరియు మూడు డీఏలను విడుదల చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంబిస్తోందని వారు ఆరోపించారు.

సీపీఎస్ రద్దు అంశం తన పరిధిలో లేదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉద్యమం చేయడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని ఆయన జేఏసీ నేతలను కోరారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మళ్లీ భేటీ అవుదామని ప్రభుత్వం ప్రతిపాదించగా, సమస్యలను ఇప్పుడే పరిష్కరించాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు.

ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఏదైనా ఒక నిర్దిష్టమైన హామీ ఇస్తేనే తాము ఆలోచిస్తామని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. మరోవైపు, డీఏల విడుదలపై సోమవారంలోగా నివేదిక సమర్పించాలని సీఎస్‌ను (రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) భట్టివిక్రమార్క ఆదేశించారు.

ఈ నేపథ్యంలో, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ కార్యవర్గం సోమవారం అత్యవసరంగా సమావేశం కానుంది. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో ఉద్యోగులందరి అభిప్రాయాలను నేతలు సేకరించనున్నారు.