ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులను అదుపు చేయడంలో విఫలమైతే, భూమిపై ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం (UNEP) తాజా నివేదికలో పేర్కొంది. పారిశ్రామికీకరణకు ముందు ఉన్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే, అత్యంత ఆశాజనకమైన పరిస్థితుల్లో కూడా ఈ స్థాయి పెరుగుదల తప్పదని నివేదిక స్పష్టం చేసింది.

వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ కారణంగా సముద్రాలు తీవ్ర ఆమ్లీకరణకు (నీటిలో ఆమ్ల గుణం పెరగడం) గురవుతున్నాయి. దీనివల్ల హిందూ మహాసముద్రంలో సముద్ర జీవుల ఆవాసాలు 200 మీటర్ల మేర తగ్గిపోయాయి. పగడపు దిబ్బలు, ఆయిస్టర్లు, క్లామ్స్ వంటి జీవులు తమ రక్షణ కవచాలను నిర్మించుకోలేక అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్‌తో పాటు చిన్న ద్వీప దేశాలు, లోతట్టు తీరప్రాంత నగరాలు సముద్ర మట్టాలు పెరగడం వల్ల ముంపు బారిన పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఆర్కిటిక్ మహాసముద్రం ఇతర సముద్రాల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు వేగంగా ఆమ్లీకరణ చెందుతోంది. ఈ మార్పులు మానవ ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి సరఫరా మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల పరిమితిని దాటితే తీవ్రమైన తుపాన్లు, కరువులు పెరిగి పర్యావరణ వ్యవస్థలు ధ్వంసమవుతాయని నివేదిక తెలిపింది. భారీ మంచు పలకలు కరిగిపోవడం, అమెజాన్ అడవుల క్షీణత, వాతావరణాన్ని నియంత్రించే అట్లాంటిక్ మెరిడినల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ (సముద్ర ప్రవాహాల వ్యవస్థ) దెబ్బతినడం వంటి కోలుకోలేని నష్టాలు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ విపత్తును అడ్డుకోవాలంటే మీథేన్ సహా హరితగృహ వాయువుల ఉద్గారాలను తక్షణమే తగ్గించి, నెట్ జీరో (ఉద్గారాల విడుదలను సున్నా స్థాయికి చేర్చడం) లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. బలమైన రాజకీయ సంకల్పం, అంతర్జాతీయ సహకారం, తగిన ఆర్థిక వనరులు సమకూరితేనే భూగోళాన్ని ఈ ముప్పు నుంచి రక్షించుకోగలమని నివేదిక ముగించింది.