బుధవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రులు మాట్లాడుతున్న సమయంలో సభలో గందరగోళం సృష్టించిన సభ్యులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.

మంగళవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్ వద్ద జరిగిన ఉద్రిక్తతలపై బీఆర్ఎస్ సభ్యులు సభలో నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని, కేసీఆర్ మరణాన్ని కోరుకున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

సభ్యుల తీరుపై శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సభలో నిరసనలు ఆపాలని స్పీకర్ పదేపదే కోరినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడంతో, వారిని సస్పెండ్ చేయాలని మంత్రి కోరారు.

దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డితో సహా మొత్తం 21 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సస్పెండైన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, సభ నుంచి సస్పెండ్ అయిన వారికి అనుమతి లేదని చెబుతూ మార్షల్స్ (సభలో భద్రత చూసే సిబ్బంది) వారిని అడ్డుకున్నారు.

మార్షల్స్‌తో ఎమ్మెల్యేలు వాగ్వివాదానికి దిగడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సస్పెన్షన్ కారణంగా ఈ ఎమ్మెల్యేలు ఇకపై సమావేశాలు ముగిసే వరకు సభకు హాజరు కావడానికి వీలుండదు.