తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్‌కు గురైన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ బుధవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడుల గురించి 13 పేజీల ఫిర్యాదును గవర్నర్‌కు సమర్పించారు.
బ్లాక్ టీ షర్ట్స్ ధరించి అసెంబ్లీకి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పురుష పోలీసులు పట్టుకున్నారని, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని ఆయన ఆరోపించారు. తమపై దాడి చేసిన వారే తిరిగి తమపై కేసులు పెడుతున్నారని, ఇది అన్యాయమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, ప్రశ్నిస్తున్న తమపై అరాచకాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసనలను, వారికి పోలీసులు సహకరించిన తీరును కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ చెప్పారు. యూరియా కొరత, రైతు భీమా, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందులను గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా ప్రస్తుత ప్రభుత్వ పాలనపై సంతోషంగా లేదని ఆయన అన్నారు.
అసెంబ్లీ లోపల జరిగిన వ్యవహారాలపై తాను చర్యలు తీసుకోలేనని గవర్నర్ స్పష్టం చేశారని కేటీఆర్ తెలిపారు. అయితే, అసెంబ్లీ బయట జరిగిన ఘటనలపై సీఎస్ (రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి), డీజీపీని పిలిపించి విచారణ చేయిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు.








