హైదరాబాద్ అసెంబ్లీలో మంగళవారం మధ్యాహ్నం బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. 22ఏ అంటే భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే నిబంధన. ఈ అంశంపై చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకు వచ్చారు.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో బ్రేక్ సమయంపై మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా 15 నుంచి 20 నిమిషాలు ఉండాల్సిన విరామ సమయాన్ని, రెండు మూడు గంటల పాటు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఐదు రోజులు మాత్రమే జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సమయం అంతా బ్రేక్‌లకే పోతే ప్రజా సమస్యలపై చర్చ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కులం పేరుతో దూషించిన ఘటనపై కూడా సభలో చర్చ జరిగింది. ఈ విషయంపై మాట్లాడటానికి స్పీకర్ కొద్ది నిమిషాల సమయం ఇచ్చారు. దీనిపై స్పందించిన మహేశ్వర్ రెడ్డి, స్పీకర్‌ను, ఆయన తల్లిని అవమానించడం తప్పు అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీది నీచాతి నీచమైన సంస్కృతి అని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, తమ ప్రధాన డిమాండ్ అయిన 22ఏ అంశంపై చర్చకు అవకాశం లేకపోవడంతోనే వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మధ్యాహ్నం 2:50 గంటలకు సెషన్ ప్రారంభమైన సమయంలో ప్యానల్ స్పీకర్‌గా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నిలబడి నిరసన తెలిపారు. 22ఏ అంశానికి సంబంధించిన ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వారు కోరారు.