బుధవారం శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బిఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఎస్సీలు నిరసనలు చేపట్టగా, వారు నిరసన తెలిపిన ప్రాంతాన్ని బిఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేశారని మంత్రి పేర్కొన్నారు.

శుద్ధీకరణ పేరుతో బిఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి ధ్వజమెత్తారు. ఎస్సీలపై బిఆర్ఎస్ వివక్ష చూపుతోందని విమర్శించిన ఆయన, ఈ ఘటనపై కెటిఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు బిఆర్ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు.

మరోవైపు, శాసనసభలో మూడో రోజు కూడా బిఆర్ఎస్ సభ్యులు నిరసనలను కొనసాగించారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వారు ప్రయత్నించారు.

సభను అడ్డుకున్నందుకు గాను 17 మంది బిఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకున్నారు. కెటిఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మీ, మాణిక్ రావు, చింతా ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్, తలసాని, సుధీర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్‌ జాదవ్, గంగుల కమలాకర్ ను ప్రస్తుత సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.