సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అలీ అహ్మద్, తన యజమాని కేటాయించిన గదిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో ద్వారా బయటపెట్టాడు. ఆ గది చాలా చిన్నదిగా ఉండటమే కాకుండా, కనీస సౌకర్యాలు కూడా లేవని ఆయన పేర్కొన్నాడు.
వీడియోలో అలీ చూపిస్తున్నట్లుగా, ఆయన పడుకునే పరుపుకు ఆనుకునే టాయిలెట్ సీటు ఉంది. మంచాన్ని మరోవైపు తిప్పితే గది తలుపులు మూయడం లేదా తెరవడం సాధ్యం కాదని, అందుకే తల పక్కనే టాయిలెట్ ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే నిద్రపోతున్నానని ఆయన వివరించాడు. మతపరమైన విశ్వాసాల కారణంగా మరో దిశలో తలపెట్టి పడుకోవడం సాధ్యం కాదని ఆయన తెలిపాడు.
భారతదేశం కంటే సౌదీలోనే మంచి వసతులు ఉంటాయని సోషల్ మీడియాలో కొందరు చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా అలీ ఈ వీడియోను రూపొందించాడు. భారత్‌లో తమ ఇళ్లు అంత పెద్దవి కాకపోయినా, కనీసం టాయిలెట్ పక్కన నిద్రపోయే దుస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అలీ పడుతున్న కష్టాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కొందరు, సౌదీ అరేబియా కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలా చేస్తే యజమానిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
మరికొందరు నెటిజన్లు అలీని స్వదేశానికి తిరిగి వచ్చేయమని సలహా ఇస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో గృహ కార్మికులు, డ్రైవర్లుగా పనిచేసే వారి జీవన ప్రమాణాలు ఏళ్లుగా ఇలాగే ఉన్నాయని, విదేశాల్లో ఉండే భారతీయ కార్మికుల భద్రతపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.








