రావల్పిండి వేదికగా సోమవారం జరిగిన టెస్టు మ్యాచ్ తొలి రోజు బాబర్ ఆజమ్ 58 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఏడు ఫోర్ల సాయంతో వచ్చిన ఈ స్కోరు, అతడి టెస్టు కెరీర్‌లో 35వ అర్ధసెంచరీగా నిలిచింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా 70 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన పాకిస్థాన్ ఆటగాడిగా మిస్బా ఉల్ హక్ సరసన బాబర్ చేరాడు. మిస్బా 189 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, బాబర్ కేవలం 164 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.

అయితే ఈ హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పినప్పటికీ, బాబర్ టెస్టు సెంచరీ కరువు మాత్రం కొనసాగుతోంది. 2022 డిసెంబర్‌లో న్యూజిలాండ్‌పై కరాచీలో 161 పరుగులు చేసిన తర్వాత, బాబర్ ఇప్పటివరకు 41 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. దీంతో టెస్టుల్లో ఎక్కువ కాలం సెంచరీ చేయని పాకిస్థాన్ బ్యాటర్ల జాబితాలో బాబర్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాలో ఆసిఫ్ ముజ్తబా కూడా 41 ఇన్నింగ్స్‌ల పాటు సెంచరీకి దూరంగా ఉన్నాడు. యాసిర్ హమీద్ 47 ఇన్నింగ్స్‌లు, రమీజ్ రాజా 74 ఇన్నింగ్స్‌ల పాటు టెస్టు సెంచరీ చేయకుండా ఈ జాబితాలో బాబర్ కంటే ముందున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిరీక్షణ నుంచి బయటపడాలంటే బాబర్ మరో సెంచరీ సాధించాల్సిందే.

శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, పాకిస్థాన్ ఓపెనర్లు అజాన్ అవైస్, తయాబ్ ఆరిఫ్ తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించారు. అవైస్ 30 పరుగుల వద్ద మిలన్ రత్నాయకే బౌలింగ్‌లో ఔట్ కాగా, తయాబ్ ఆరిఫ్ 51 బంతుల్లో 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం బాబర్, మహమ్మద్ తాహా మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. 35వ ఓవర్‌లో దిల్షాన్ మదుశంక బౌలింగ్‌లో బాబర్ ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది.