ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌ 2026 (ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే 19 ఏళ్ల లోపు వయస్సు గల యువకుల అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ)లో భాగంగా ఇవాళ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

అయితే, భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడింది. కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ తొలి ఓవర్లోనే డకౌట్ కాగా, వీకే వినీత్, యశ్వర్ధన్ చౌహాన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆర్యవీర్ సెహ్వాగ్ 42 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన అర్జున్ రాజ్‌పూత్ పాకిస్థాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కేవలం 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అర్జున్, ఆ తర్వాత మరింత వేగంగా ఆడి 80 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు.

మిగిలిన బ్యాటర్ల నుంచి అర్జున్‌కు సరైన సహకారం అందలేదు. ఆర్యవీర్ సెహ్వాగ్ 22, ఆన్వయ్ ద్రవిడ్ 10, మనల్ చౌహాన్ 11 పరుగులకే పరిమితమయ్యారు. ఆఖర్లో కావ్య పటేల్ 23 పరుగులు చేయడంతో భారత్ 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది.

పాకిస్థాన్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్ తలో 3 వికెట్లు తీశారు. మొహమ్మద్ సయ్యమ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అర్జున్ రాజ్‌పూత్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది.