సియాటెల్ సెంటర్ వద్ద భారతీయులు కుటుంబాలు, పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటుండగా ఈ ఘటన జరిగింది. జేక్ లాంగ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని, హిందూ సమాజాన్ని అవమానించేలా నినాదాలు చేస్తూ వేడుకలను పాడుచేయాలని ప్రయత్నించాడు. చేతుల్లో జాతివిద్వేష నినాదాలు రాసి ఉన్న బోర్డులను వారు ప్రదర్శించారు.

అయితే, వేడుక నిర్వాహకులు, అక్కడ ఉన్న స్థానికులు ఏమాత్రం భయపడకుండా వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను వేడుక జరుగుతున్న ప్రాంతంలోకి రాకుండా నిలదీయడంతో, వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనతో అక్కడ పెద్ద గొడవ జరగకుండా తప్పింది.

ఘటన తర్వాత జేక్ లాంగ్ సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టాడు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోవడానికి, కొన్ని ప్రాంతాల్లో పట్టు కోల్పోవడానికి హిందూ ఓటర్లే కారణమని అతను ఆరోపించాడు. ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకనే అతను పండుగ వేళ ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై భారతీయ అమెరికన్ నాయకులు, సంఘాలు తీవ్రంగా స్పందించాయి. అమెరికాలోని ప్రముఖుల్లో ఒకరైన ప్రమీలా జయపాల్ మాట్లాడుతూ, దీపావళి అంటే చీకటిపై వెలుగు సాధించిన విజయమని, సమాజంలో జాత్యహంకారానికి తావులేదని స్పష్టం చేశారు. ఇటీవలే చికాగో సమీపంలో ఒక ఆలయంపై దాడికి కుట్ర పన్నిన ఘటనను కూడా వారు గుర్తు చేశారు.

ప్రవాస భారతీయులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, వేడుకలు జరిగే చోట, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను పెంచాలని స్థానిక ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.