ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత నెలవారీ పింఛను ఇచ్చే పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారితో పాటు, ఇప్పటికే పదవీ విరమణ చేసిన అర్హులైన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా ఈ వెసులుబాటును పొందే అవకాశం ఉంది.
అయితే, ఈ అవకాశం అందరికీ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే నియామక ప్రకటన (Recruitment Notification) జారీ అయి ఉండాలి. ఆ నోటిఫికేషన్ ఆధారంగా 2004 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరి, ప్రస్తుతం CPS పరిధిలో ఉన్నవారు మాత్రమే OPSకు మారేందుకు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హులైన వారు NIDHI పోర్టల్లో ‘CPS-OPS Conversion’ అనే ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు నియామక నోటిఫికేషన్, సెలక్షన్ లిస్ట్, అపాయింట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్ అనే నాలుగు పత్రాలను సంబంధిత అధికారుల ధ్రువీకరణతో సమర్పించడం తప్పనిసరి. ఈ పత్రాలను అధికారులు 15 పని దినాల్లోగా ధ్రువీకరించి, ఏడు రోజుల్లోగా వాటి నిజానిజాలను నిర్ధారించాలి.
ఉద్యోగి సమర్పించిన పత్రాలను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO) పరిశీలించిన తర్వాత, 10 పని దినాల్లో తదుపరి ప్రక్రియ కోసం పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన OPS వర్తించదు; అర్హతలను పరిశీలించిన తర్వాత కాంపిటెంట్ అథారిటీ (అధికారిక నిర్ణయాధికారి) ఆమోదం తెలిపితేనే మార్పు జరుగుతుంది. ఒకసారి OPSలోకి మారిన తర్వాత మళ్లీ CPS విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు.
OPSలోకి మారిన వారికి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 వర్తిస్తాయి. వీరి కోసం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాను తెరుస్తారు. ఇప్పటివరకు CPS కింద ఉద్యోగి జమ చేసిన వాటాను GPF ఖాతాకు బదిలీ చేస్తారు, కానీ ప్రభుత్వ వాటాను మాత్రం ప్రభుత్వ ఖాతాలోనే ఉంచుతారు. CPS ఖాతాలోని సొమ్మును ఉద్యోగులు నేరుగా నగదు రూపంలో తీసుకునేందుకు వీలుండదు.
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు 2026 డిసెంబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా నిబంధనలను పాటించి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ మార్పు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.








