రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీకి మార్చింది. దీనితో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా 5వ తేదీ నుంచి 7వ తేదీకి వాయిదా వేస్తూ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉండటంతో, ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ఈ మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. గతంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 1కి, ఓట్ల లెక్కింపును నవంబర్ 3కి ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే.
తాజా నిర్ణయం ప్రకారం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 5న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 7న పూర్తవుతుంది.
అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని 88 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మిగిలిన ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
మరోవైపు, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1న యథావిధిగా జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.








