పూణేలోని ఎంసీఏ గ్రౌండ్ 2లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఇది దేశీయ టీ20 క్రికెట్‌లో మహిళల జట్టు సాధించిన అత్యధిక స్కోరు. 2019-20 సీజన్‌లో గోవా జట్టు అరుణాచల్ ప్రదేశ్‌పై సాధించిన 257 పరుగుల రికార్డును ఢిల్లీ అధిగమించింది.

ఈ భారీ స్కోరు సాధించడంలో ఓపెనర్ తనీషా సింగ్ కీలక పాత్ర పోషించింది. ఆమె కేవలం 47 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 119 పరుగులు చేసింది. తనీషా 38 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మహిళల టీ20 క్రికెట్‌లో మూడవ వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది.

తనీషాకు తోడుగా ప్రియా పునియా 28 బంతుల్లో 59 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి కేవలం 66 బంతుల్లోనే 160 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత శ్వేతా సెహ్రావత్ 8 బంతుల్లోనే 26 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించింది.

హైదరాబాద్ బౌలర్లలో వంకా పూజ మాత్రమే రాణించింది. ఆమె తన నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. మిగిలిన ఏడుగురు బౌలర్లు ఓవర్‌కు కనీసం 11 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 154 పరుగులకే పరిమితమైంది. జి త్రిష 52 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచినా, కెప్టెన్ ప్రణవి చంద్ర మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ 20 పరుగుల మార్కును దాటలేదు. దీంతో ఢిల్లీ 108 పరుగుల తేడాతో కమాండింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది.