రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో జూలై 29న ప్రారంభమైన విద్యార్థుల నిరసన ఆదివారానికి ఐదవ రోజుకు చేరింది. జూలై 2న విడుదలైన JPSC పరీక్ష ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వందలాది మంది విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకు భారీ టార్చ్‌లైట్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే జార్ఖండ్ అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

గత ఏడేళ్లలో జరిగిన అన్ని JPSC, JSSC నియామక పరీక్షలపై సీబీఐ (CBI) స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సీఐడీ విచారణకు ఆదేశించినప్పటికీ, దానిపై నమ్మకం లేదని అభ్యర్థులు రాహుల్ కుమార్ క్రాంతి, అంకిత్ కుమార్ పేర్కొన్నారు. గతంలో జరిగిన పేపర్ లీక్ కేసుల్లో సరైన చర్యలు తీసుకోలేదని, ఈసారి కూడా విచారణను పక్కన పెట్టే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని వారు కోరుతున్నారు.

విద్యార్థుల పోరాటానికి కాక్రోచ్ జనతాపార్టీ (CJP) నాయకులు అభిజీత్ దీప్కే, అశుతోష్ మద్దతు ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఆహార పదార్థాలను పంపిస్తూ నిరసనకారులకు అండగా నిలుస్తున్నారు. విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచేందుకు విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో నిరవదిక నిరాహార దీక్షను ప్రారంభించారు.

ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. జూలై 20న ముఖ్యమంత్రిని కలిసి పేపర్ లీక్‌కు సంబంధించిన ఆధారాలను సమర్పించినా ఫలితం లేకపోవడంతో, పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని విద్యార్థి నాయకుడు మహతో ప్రకటించారు.