తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి 2002 నాటి జాబితా వివరాలు కోరడం పెద్ద సమస్యగా మారింది. ఎన్నికల సంఘం (ఈసీ) చెప్పినదానికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికీ పొంతన కుదరకపోవడంతో సాధారణ ఓటర్లలో సందేహాలు నెలకొన్నాయి. బీఎల్వోలకు ఫారాలు నింపే విధానంపై అవగాహన లేకపోవడం ఈ గందరగోళాన్ని మరింత పెంచింది.

ప్రస్తుత SIR ఫారం రెండో భాగంలో కుటుంబం గత 23 ఏళ్లుగా భారతదేశంలోనే నివసిస్తున్నట్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఇవ్వనివారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించే ప్రమాదం ఉందని అంచనా. అయితే 24 ఏళ్ల క్రితం నియోజకవర్గాలు, పోలింగ్ బూతులు మారిపోవడంతో అప్పటి వివరాలు గుర్తుచేసుకోవడం ఓటర్లకు కష్టంగా మారింది.

ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం ప్రహసనంగా మారితే, బీఎల్వోలు మాత్రం ఓటర్లను అధికారుల వద్దకు వెళ్లమని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అనుకున్న గడువులోగా SIR ప్రక్రియ పూర్తవుతుందా అని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని పార్టీలు మొత్తుకుంటుంటే, ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోకపోతే ఓటర్ల భయాందోళనలు తగ్గే అవకాశం లేదు.