ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ ఈ జాబితాను ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియలో భాగంగా ఈ ముసాయిదాను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా మొత్తం జనాభా 24,45,334 కాగా, అందులో 15,89,731 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
నమోదైన ఓటర్లలో 8,17,936 మంది మహిళలు, 7,71,648 మంది పురుషులు, 147 మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఉన్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1060 మంది మహిళా ఓటర్లు ఉండటం గమనార్హం. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, మైలవరం నియోజకవర్గంలో అత్యధికంగా 2,64,459 మంది ఓటర్లు ఉన్నారు.
ప్రజల పరిశీలన కోసం జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాల్లో ఈ జాబితాను ఉంచారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవాలని, తప్పులు ఉంటే సవరణలు లేదా కొత్తగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం గుర్తించిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించవచ్చు.
జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం సెప్టెంబర్ 28 వరకు విచారణ, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని దరఖాస్తులను పరిశీలించిన తర్వాత, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.







