ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘Act No.22 of 2026’ పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 28 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మేయర్, వార్డు సభ్యుల ఎన్నికకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది.
గతంలో ఉన్న బ్యాలెట్ పేపర్ల పద్ధతిని రద్దు చేస్తూ, ఇకపై మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల) ద్వారానే ఓటింగ్ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓటర్లకు ‘నోటా’ (ఎవరికీ ఓటు వేయని అవకాశం) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పుల వల్ల ఓటింగ్ ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా, అక్రమాలకు అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన గడువును నిర్ణయించింది. కార్పొరేషన్ తొలి సమావేశం జరిగిన 15 రోజుల్లోపే డిప్యూటీ మేయర్ ఎన్నికను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికకు ఒక రోజు ముందే విప్ (పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జారీ చేసే ఆదేశం) పత్రాన్ని సమర్పించాలని సూచించింది.
విప్‌ను ధిక్కరించే కౌన్సిలర్ల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఒకవేళ ఎన్నికలో అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే, లాటరీ పద్ధతి ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ డిప్యూటీ మేయర్ స్థానం ఖాళీ అయితే, ఆరు నెలల లోపు భర్తీ చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు.








