పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో కీలక మార్పు చోటుచేసుకుంది. నాభా జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్న కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గురుప్రీత్ సింగ్ సేఖోన్, ఆ పార్టీలో చేరారు. ఫిరోజ్‌పూర్ జిల్లా జీరాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జీరా నియోజకవర్గం నుంచి సేఖోన్ ఆప్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామంతో ఆ నియోజకవర్గంలోని ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే నరేష్ కటారియా వర్గంలో చర్చ మొదలైంది. జీరా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

2016 నవంబర్ 27న నాభా జైలు నుంచి ఆరుగురు ఖైదీలు తప్పించుకున్న ఘటన దేశవ్యాప్తంగా సృష్టించింది. ఈ కేసులో కీలక నిందితుడైన సేఖోన్‌ను 2017 ఫిబ్రవరిలో మోగా జిల్లా ధుడికే గ్రామంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై హత్య, హత్యాయత్నం వంటి అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

సేఖోన్ గత కొంతకాలంగా స్థానిక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్, బ్లాక్ సమితి ఎన్నికల్లో తన ఇద్దరు బంధువులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఆయన రాజకీయ ప్రవేశంతో నియోజకవర్గంలో కొత్త చర్చ మొదలైంది.

జీరా నియోజకవర్గం గతంలో శిరోమణి అకాలీ దళ్‌కు కంచుకోటగా ఉండేది. అయితే మాజీ ఎమ్మెల్యే హరి సింగ్ జీరా మరణం తర్వాత ఆ పార్టీ ప్రభావం తగ్గింది. 2017లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరా గెలుపొందగా, 2022లో ఆప్‌కు చెందిన నరేష్ కటారియా విజయం సాధించారు.