తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమై, 15 నుంచి 23వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 15న సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది. 16న ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తారు. 17న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 18న కల్పవృక్షం, సర్వ భూపాల వాహన సేవలు ఉంటాయి.
19న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 20న హనుమంత వాహనం, స్వర్ణ రథం, గజ వాహనం, 21న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. 22న రథోత్సవం, అశ్వ వాహన సేవలు జరగనున్నాయి.
చివరి రోజు సెప్టెంబర్ 23న ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.






