ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం వరద జలాలతో నిండి ఉందని, దీని నుంచి మిడ్ మానేరు, లోయర్ మానేరుతో పాటు ఇతర రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయబోతున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించామని, కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రావిటీ ద్వారా వరద నీటిని తరలించేలా దీనిని డిజైన్ చేశాయని ఆయన వివరించారు.
గత కెసిఆర్ ప్రభుత్వం రివర్స్ పంపింగ్ పేరుతో లిఫ్టులను ఏర్పాటు చేసి భారీగా విద్యుత్ ఖర్చు చేసిందని మంత్రి విమర్శించారు. ఎత్తిపోతలు లేకుండానే ఇప్పుడు ఎల్లంపల్లికి నీరు వచ్చిందని, దీనిపై బిఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారానే నీరు వచ్చేదని, కానీ కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి దానిని కూలేశ్వరంగా మార్చారని ఆయన ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలోనే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో రైతులు అత్యధికంగా పంటలు పండిస్తున్నారని, ప్రస్తుత ప్రభుత్వ డిజైన్ల వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అడ్రసు గల్లంతు అవుతుందని ఆయన హెచ్చరించారు.








