తమిళనాడు శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత కొన్ని నెలలుగా మంత్రుల పరిపాలనా సామర్థ్యం, పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక సర్వేలు, అంతర్గత విచారణలు నిర్వహించింది. వీటి ఆధారంగానే మంత్రివర్గ ప్రక్షాళనకు సీఎం విజయ్ ప్రణాళికలు రచిస్తున్నారు.
ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని మంత్రులను, వివాదాల్లో చిక్కుకున్న వారిని పదవుల నుంచి తొలగించే అవకాశం ఉంది. వీరి స్థానంలో సమర్థులైన కొత్తవారికి కీలక శాఖలను అప్పగించాలని టీవీకే నాయకత్వం భావిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడంలో వేగం పెంచేందుకు పరిశ్రమల శాఖను అధవ్ అర్జునకు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అనుభవజ్ఞుడైన సెంగోట్టయాన్‌కు పాఠశాల విద్యా శాఖను అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. మంత్రి రాజ్ మోహన్‌కు ఇతర ముఖ్య బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే, ప్రస్తుతం పరిశ్రమల మంత్రిగా ఉన్న కీర్తనకు మానవ వనరుల అభివృద్ధి శాఖను అప్పగించే అంశాన్ని టీవీకే నాయకత్వం పరిశీలిస్తోంది.
మంత్రివర్గ మార్పుల ప్రభావం కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులపై కూడా ఉండనుంది. విశ్వనాథన్, రాజేష్ కుమార్ నిర్వహిస్తున్న శాఖల్లో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మరికొందరు మంత్రుల స్థానాలను కూడా కదిలించే దిశగా టీవీకే నాయకత్వం అడుగులు వేస్తోంది.
శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. సమర్థులైన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పరిపాలనను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.







