కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్కీ లాటరీ ద్వారా ముఖ్యమంత్రి పదవిని పొందిన రేవంత్ రెడ్డికి, యువత శక్తి ఏమిటో త్వరలోనే చూపిస్తామని ఆయన హెచ్చరించారు.

ప్రధాని మోదీని సైతం గడగడలాడించిన యువత ముందు, రేవంత్ రెడ్డి ఒక చిన్న నాయకుడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని, ఆ పార్టీ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోగా లూటిఫికేషన్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కనిపించకుండా పోయారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలల భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

ప్రశ్నించే వారిని బెదిరిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక రౌడీషీటరా అని కేటీఆర్ నిలదీశారు. పోలీసుల తీరును కూడా ఆయన తప్పుబట్టారు. అతిగా వ్యవహరిస్తున్న పోలీసులతో సహా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

రాబోయే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము పదవిలో ఉన్నా లేకున్నా, చేసిన తప్పులకు ఎవరినీ వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు.