ఖమ్మం నగరంలో పేరుకుపోయిన చెత్త, పూడుకుపోయిన మురుగు కాలువలు, నిల్వ ఉన్న వర్షపు నీటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంతో పాటు, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని కోరారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

నిల్వ ఉన్న నీటి ప్రాంతాల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయాలని, యాంటీ లార్వా మందులను క్రమం తప్పకుండా పిచికారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నగరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమర్థంగా పనిచేయాలని పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు.