భారత ప్రాదేశిక సముద్ర జలాలు, తీర ప్రాంతాల్లో చమురు నిల్వలను గుర్తించి వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం 'సముద్ర మంథన్' అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు సాగుతాయి.
ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 84,084 కోట్లు ఖర్చు చేయనుంది. ఇండియాకు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజడ్) పరిధిలో భారీ స్థాయిలో ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటిని వెలికితీసేందుకు ప్రత్యేకంగా సంయుక్త చమురు, గ్యాస్ ఉత్పత్తి జోన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
2030-31 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది. దీని ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిక్షేపాలను వెలికితీస్తామని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ చమురు ఉత్పత్తి పెరగడం వల్ల విదేశాలపై ఆధారపడటం తగ్గి, భారత నిధులు ఆదా అవుతాయని కేంద్రం పేర్కొంది.
ఈ పథకం అమలుతో చమురు ఉత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో 'సముద్ర మంథన్' కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రం చెబుతోంది.







