ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రభావం చూపుతున్న ముస్లింల పేర్లతో కూడిన ఈ జాబితాను జోర్డాన్ దేశానికి చెందిన రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ అనే సంస్థ ప్రచురిస్తుంది. 2009లో మొదలైన ఈ ప్రక్రియలో భాగంగా, తాజాగా 2027 సంవత్సరానికి గానూ 18వ వార్షిక నివేదికను సంస్థ విడుదల చేసింది. మొత్తం 82 దేశాల నుంచి 509 మంది పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

భారతదేశం నుంచి ఎంపికైన 22 మందిలో మత నాయకులు, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు ఉన్నారు. జమియత్ ఉలేమా ఏ హింద్ సంస్థ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ భారతీయులందరిలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆయన 18వ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఈసారి జాబితాలో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ మొదటిసారిగా చోటు సంపాదించుకున్నారు. ఆయనతో పాటు అమీర్ ఖాన్, నటి షబానా అజ్మీ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కూడా ఈ జాబితాలో స్థానం పొందారు. వీరు కాకుండా అజీమ్ ప్రేమ్ జీ, ఒవైసీ, డాక్టర్ జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ వంటి ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో పాకిస్తాన్ ప్రధాని షాహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అగ్రస్థానంలో ఉన్నారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లతో కలిసి వారు ఈ మొదటి స్థానాన్ని పంచుకున్నారు.

ఈ జాబితాలో షేక్ అబూ బకర్ అహ్మద్, మౌలానా ఖమరుజ్జమాన్ అజ్మీ, సయ్యద్ ఇబ్రహీముల్ ఖలీల్ అల్-బుఖారీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, డాక్టర్ హసీమా హసన్, మౌలానా సాద్ కంధల్వీ, మౌలానా ఝునాహల్వి, డాక్టర్ సానియా సనైన్ ఖాన్, మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ, డాక్టర్ బహౌద్దీన్ ముహమ్మద్ జమాలుద్దీన్ నద్వీ, ముఫ్తీ అబుల్ ఖాసిం నాయక్, అస్లీ నొమానీ, మౌలానా బద్రుద్దీన్ అజ్మల్, సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ కూడా ఉన్నారు.