తెలుగు బిగ్‌బాస్ షోలో మొదటి సీజన్ నుంచే సామాన్యులకు అవకాశం ఇస్తున్నారు. అయితే గతంలో ఒక్కొక్కరిని మాత్రమే ఎంపిక చేసేవారు కాగా, ఆ ఎంపిక విధానం ఎలా ఉంటుందనేది స్పష్టంగా తెలిసేది కాదు. పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌస్‌లోకి వచ్చి విజేతగా నిలిచిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల ఏకంగా గత సీజన్ విన్నర్‌గా నిలిచాడు.
ఈసారి కూడా అగ్నిపరీక్ష రౌండ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన సామాన్యులలో రోహిత్ ఒకడు. సోషల్ మీడియాలో ఈయన గురించి ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ బిగ్‌బాస్ హౌస్ లోపల ఈయన ఆట మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోయింది. షాలినీతో కబుర్లు చెప్పడం మినహా రోహిత్ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో, 8వ వారం చివర్లో ఊహించని విధంగా అతడిని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు.
షో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రోహిత్ మళ్లీ రీఎంట్రీ ఇస్తాడంటూ సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ వార్తలన్నింటిపై రోహిత్ టీమ్ స్పష్టత ఇచ్చేసింది. హౌస్‌లోకి మళ్లీ వెళ్లే అవకాశం ఎలాంటిదీ లేదని వాళ్లు తేల్చిచెప్పారు.
ఇక్కడితో ఈ విషయం ముగుస్తుందనుకున్న సమయంలో రోహిత్ పెట్టిన ఒక ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 'వెంట్రుక కూడా...' అంటూ సాగే ఆ ట్వీట్ నేరుగా షో యాజమాన్యాన్నే ఉద్దేశించే పెట్టాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎలిమినేట్ అయిన తర్వాత అనవసరంగా ఇలాంటి వివాదాలు ఎందుకని కొందరు నెటిజన్లు ఆయన తీరును తప్పుపడుతున్నారు.







