బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. వర్షిణి, నరేష్‌ను నామినేట్ చేయగా, శివను కూడా లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు, ముకేశ్ ప్రవర్తనపై శివ, దేబ్జానీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. త్రిగున్, వర్షిణిని మోసపూరిత స్నేహం పేరుతో నామినేట్ చేయగా, ముకేశ్‌ను కఠిన పదాలతో విమర్శించాడు.
నామినేషన్ల అనంతరం సుధీర్, నరేష్, ముకేశ్ మధ్య జరిగిన చర్చలు ఆసక్తికరంగా మారాయి. సుధీర్ తన టీమ్ సభ్యులైన ముకేశ్, వర్షిణి చేసిన తప్పులను ఎత్తిచూపడంతో వారు ఆశ్చర్యపోయారు. ముకేశ్, వర్షిణి ఇద్దరూ సుధీర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ చర్చించుకున్నారు.
రాబోయే వారం 'ఫ్యామిలీ వీక్' ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే, అందరు కంటెస్టెంట్లకు తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం దక్కదు. రాబోయే ఛాలెంజ్‌లలో గెలిచిన వారు మాత్రమే తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో పాటు కెప్టెన్సీ పోటీకి అర్హత సాధిస్తారు.
రివార్డ్ కావాలంటే ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. రివెంజ్ ఎదుర్కొన్న వారు కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం, కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కోల్పోతారు. ఈ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లు తమ వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం గురించి పంచుకున్నారు.







