వరంగల్ జిల్లా హనుమకొండలోని వాయుపుత్ర కాలనీలో ఇద్దరు మహిళలు అద్దె ఇల్లు కోసమంటూ వెళ్లి ఓ వృద్ధురాలిపై దొంగతనానికి పాల్పడ్డారు. టూ లెట్ బోర్డు ఉన్న ఇంట్లోకి వెళ్లిన ఆ మహిళలు, ఆ సమయంలో ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల జయప్రదను టార్గెట్ చేశారు.
వెళ్లిన వెంటనే ఆమెను బలవంతంగా కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసుతో పాటు చేతికి ఉన్న బంగారు గాజులను దోచుకున్నారు. ఈ ఘటన సమయంలో వృద్ధురాలు గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
అయితే, అప్పటికే ఆ ఇద్దరు మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు. హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పోలీసులు నిమగ్నమై ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారు.
పోలీసులు ఆటల్లో బిజీగా ఉన్న సమయాన్ని చూసి ఈ మహిళలు దర్జాగా ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.
క్లాస్‌గా తయారై వచ్చి ఈ దోపిడీకి పాల్పడిన ఆ ఇద్దరు మహిళల దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ మహిళా దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.







