అమెరికాలోని వర్జీనియా 10వ కాంగ్రెస్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రమణ్యం మంగళవారం తిరిగి ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారం ముగిసిందని, వాషింగ్టన్ నగరంలో మార్పు తెచ్చేందుకు అందరితో కలిసి పనిచేస్తానని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.

సుబ్రమణ్యం తల్లి బెంగళూరుకు చెందినవారు కాగా, తండ్రి చెన్నై, సికింద్రాబాద్‌లలో పెరిగారు. ఆయన తల్లి 1979లో అమెరికాలోని డల్లెస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో 1986లో జన్మించిన సుబ్రమణ్యం తులానే యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివారు. ఆ తర్వాత నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్నారు.

గతంలో ఆయన ప్రతినిధి సుజానే కోస్మాస్‌కు సహాయకుడిగా, సెనేట్ జ్యుడీషియరీ కమిటీలో సెనేటర్ డిక్ డర్బిన్‌కు గుమస్తాగా పనిచేశారు. ఆ సమయంలో చిన్న వయసులో అమెరికాకు వచ్చిన వలసదారులకు చట్టపరమైన రక్షణ కల్పించే డ్రీం చట్టంపై ఆయన పనిచేశారు. అంతేకాదు, 2015 నుంచి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా సేవలు అందించారు.

న్యాయవాదిగా, చిన్న టెక్నాలజీ వ్యాపార యజమానిగా పనిచేసిన ఆయన, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడిగా మరియు అగ్నిమాపక సిబ్బందిగా కూడా స్వచ్ఛంద సేవలు అందించారు. 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికై, అక్కడ ఆ గుర్తింపు పొందిన తొలి భారతీయ అమెరికన్, తొలి దక్షిణాసియా వ్యక్తిగా నిలిచారు.