క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి 'ప్రాజెక్ట్ - Z' ఒక మంచి ఎంపిక. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందింది. IMDb లో ఈ సినిమాకు 7 పాయింట్లకు పైగా రేటింగ్ ఉండటం విశేషం.

ఈ సినిమా కథ ఒక క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. ఒక దొంగను పట్టుకునే ప్రయత్నంలో జిమ్ ట్రైనర్ తన భార్యను హత్య చేయడం కుమార్ గమనిస్తాడు. ఆ ట్రైనర్‌ను పట్టుకునే క్రమంలో జరిగిన తోపులాటలో, కుమార్ అతడిని పొడవడంతో ట్రైనర్ అక్కడికక్కడే మరణిస్తాడు. ఈ ఘటనలో కుమార్ కూడా తీవ్రంగా గాయపడతాడు.

ఉద్యోగంలో తిరిగి చేరడానికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం కుమార్ ప్రయత్నిస్తుంటాడు. ఈ సమయంలోనే సైకోథెరపిస్ట్ అదిరతో అతనికి పరిచయం ఏర్పడుతుంది. అదే సమయంలో నగరంలో వరుసగా హత్యలు జరిగి కలకలం రేపుతాయి.

రక్తం చూడగానే భయపడిపోయే కుమార్, ఈ సీరియల్ మర్డర్స్ కేసును ఎలా ఛేదించాడన్నదే ఈ సినిమా కథాంశం. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌లో సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు డేనియల్ బాలాజీ, జయప్రకాష్, కే ఎస్ రవికుమార్, మైమ్ గోపీ, భాగవతి పెరుమాళ్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా యూట్యూబ్‌లో ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంది. థ్రిల్లింగ్ ట్విస్టులు, ఆసక్తికరమైన కథనంతో సాగే ఈ చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్ ప్రియులు చూడవచ్చు.