కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 453 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమైంది.

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, నీమ్ కరోలి బాబా జీవిత చరిత్రతో పాటు 'డివైన్ డిటూర్: దట్ చేంజ్డ్ మై లైఫ్' అనే పుస్తకంలోని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. స్వయంభూ మీడియా నెట్‌వర్క్ బ్యానర్‌పై విశాల్ చతుర్వేది స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో శోభినవ్ సత్య బాబా పాత్రలో నటించారు.

ఈ సినిమా మొదట ఆగష్టు 7న కేవలం హిందీ వెర్షన్‌లో మాత్రమే థియేటర్లలో విడుదలైంది. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం, స్టార్ నటులు లేకపోవడంతో ప్రారంభంలో వసూళ్లు నెమ్మదిగా సాగాయి. అయితే, ప్రేక్షకుల నుంచి లభించిన మంచి స్పందనతో మూడవ వారం నుంచి వసూళ్లు పుంజుకున్నాయి.

థియేటర్లలో దాదాపు మూడు నెలల పాటు ప్రదర్శితమైన ఈ చిత్రాన్ని, ప్రముఖ ఓటీటీ సంస్థ SonyLIV డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్ 27 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రంలో విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమా తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవాన్‌దాస్ పటేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిందీతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.