హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట చెరువును ఈ నెల 11న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, డీసీపీ రితిరాజ్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. చెరువు వద్ద వేదిక, పార్కింగ్, సీటింగ్, ప్రవేశ మార్గాలను అధికారులు పరిశీలించారు.

గతంలో ఈ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ (చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం పరిధి) పరిధిలో అక్రమ నిర్మాణాలు చేశారంటూ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. ఇప్పుడు అదే చెరువు ప్రారంభోత్సవానికి నాగార్జునకు గౌరవ అతిథిగా ఆహ్వానం దక్కింది. చెరువు అభివృద్ధి చేసిన తీరును విమోస్ టెక్నోక్రాట్స్ అధినేత యూనస్ పర్వేజ్ అధికారులకు వివరించారు.

గతంలో ఈ చెరువు చెత్త, నిర్మాణ వ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాల డంపింగ్ యార్డుగా మారి దుర్గంధభరితంగా ఉండేదని అధికారులు తెలిపారు. హైడ్రా పునరుద్ధరణ పనులతో చెరువు రూపురేఖలు పూర్తిగా మారాయి. చెరువులో 30 వేల ట్రక్కులకు పైగా పూడికను తొలగించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చారు.

చెరువు చుట్టూ 1.6 కిలోమీటర్ల మేర వాకింగ్ పాత్ ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం అత్యాధునిక ఓపెన్ జిమ్, పిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలం, కూర్చునే వేదికలను సిద్ధం చేశారు. వేదిక మధ్యలో 60 ఏళ్ల బోన్సాయ్ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు అనుకూలంగా ఈ చెరువును అభివృద్ధి చేశారు.

ఈ పర్యటనలో భాగంగా రామంతాపూర్ పెద్ద చెరువు అభివృద్ధి పనుల్లో గుడిసెలు కోల్పోయిన 34 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు.