విజయవాడలో విధుల్లో ఉన్నప్పుడు ఒక కమాండో స్పృహతప్పి పడిపోవడంతో దేశంలోని వీఐపీ భద్రతా కమాండోల కోసం కొత్త దుస్తులను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) సిఫార్సు చేసింది. ఏప్రిల్ నెలలో విజయవాడలో దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో ఉన్న కమాండో హీట్ స్ట్రోక్, అలసట కారణంగా పడిపోయాడు.
ఆ సమయంలో ఆ కమాండో నల్లటి దుస్తులపై బులెట్ ప్రూఫ్ జాకెట్, తలపై నల్లటి టోపి, నడుము చుట్టూ చిన్న ఆయుధాలు ధరించి ఉన్నాడు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్ఎస్జీ కమాండర్లు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భద్రతా సిబ్బందిపై పడుతున్న శారీరక భారాన్ని గుర్తించారు. నల్లటి దుస్తులు ఎక్కువ వేడిని పీల్చుకోవడం, సుమారు 6 కేజీల బరువున్న బులెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని తేల్చారు.
ఈ నేపథ్యంలో కమాండోలకు మెరుగైన దుస్తులను అందించాలని నిర్ణయించారు. నైలాన్ మరియు కాటన్ కలిగిన 'నైకో' అనే గాలి, తేమ వెళ్లే పదార్థాన్ని ఎన్ఎస్జీ వీఐపీ భద్రతా కమాండోల నల్లని దుస్తుల కోసం సిఫార్సు చేశారు. సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు కూడా ఇదే రకమైన దుస్తులను ధరిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ కొత్త దుస్తుల ట్రయల్స్ పూర్తయ్యాయి మరియు ఎన్ఎస్జీ త్వరలోనే ఈ మెటీరియల్ను కొనుగోలు చేయనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఎన్ఎస్జీ రక్షణ పొందే వ్యక్తుల కోసం ఈ ఎన్నికల సమయానికి కమాండోలు కొత్త దుస్తులను ధరించే అవకాశం ఉంది.








