రుద్రవనం అనే మారుమూల గ్రామంలో శివకుమార్ అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన భార్య శ్రావణి డెలివరీ కోసం పది రోజుల సెలవు తీసుకోవాలని శివకుమార్ అనుకుంటాడు. అయితే, అదే సమయంలో వరుస హత్యలు జరగడం, ఎమ్మెల్యే భైరవుడు తమ్ముడికి సంబంధించిన కేసు ఒకటి రావడం కథలో కీలక మలుపులు.

ముఖ్యంగా ఒక తల లేని శవం కనిపించడంతో కేసు తీవ్రత పెరుగుతుంది. అసలు ఆ శవం ఎవరిది, ఈ హత్యలకు ఎమ్మెల్యే తమ్ముడికి ఉన్న సంబంధం ఏమిటి, వరుస నేరాల వెనుక ఉన్నది ఎవరు అనే అంశాలను శివకుమార్ ఎలా ఛేదించాడనేది మిగతా కథ. ఈ సిరీస్‌లో హీరో, విలన్ ట్రాక్స్‌ను దర్శకుడు సమాంతరంగా నడిపించాడు.

మొదటి ఐదు ఎపిసోడ్ల వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పోలీసుల విచారణ, ఒక్కో కేసు వెనుక బయటపడే విషయాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. కుటుంబ సంబంధాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా కథకు భావోద్వేగాన్ని జోడిస్తాయి.

అయితే, చివరి రెండు ఎపిసోడ్ల దగ్గరకు వచ్చేసరికి కథలో ఆసక్తి తగ్గుతుంది. ముగింపు విషయంలో దర్శకుడు తడబడ్డాడనిపిస్తుంది. ప్రేక్షకులు ఊహించే విధంగానే సన్నివేశాలు సాగడం, చివర్లో వచ్చే ట్విస్టులు అంతగా ఆశ్చర్యపరచకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.

హీరో భార్యకు సంబంధించిన ప్రేమకథా ట్రాక్ ప్రధాన కథకు అంతగా అవసరం లేదనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను తగ్గించి, ముగింపును మరింత బలంగా రాసుకుని ఉంటే సిరీస్‌ స్థాయి మరోలా ఉండేది. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కూడా కథకు పెద్దగా బలాన్ని చేకూర్చలేదు.

నరేశ్ అగస్త్య తన నటనతో ఆకట్టుకున్నాడు. బాధ్యతగల పోలీస్ అధికారిగా, కుటుంబాన్ని ప్రేమించే భర్తగా రెండు కోణాల్లోనూ సహజంగా నటించాడు. సీనియర్ నటుడు బెనర్జీ పై అధికారిగా, రాజా రవీంద్ర రాజకీయ నాయకుడి పాత్రలో తమ పరిధి మేరకు చక్కగా నటించారు.

మొత్తంగా చూస్తే, క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఒకసారి ప్రయత్నించదగ్గది. నిర్మాణ విలువలు బాగున్నాయి, కానీ బలమైన ముగింపు లేకపోవడం ఈ సిరీస్‌కు ఒక లోటుగా మిగిలిపోయింది.