రోహిత్ ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగియగా, సోమవారం నామినేషన్ల ప్రక్రియతో కొత్త ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం హౌస్‌లో 'రివార్డ్ అండ్ రివెంజ్' ఉండనుందని బిగ్‌బాస్ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాలని, నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి ఫోటోలను ఫైర్ పిట్‌లో వేసి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కెప్టెన్‌గా ఉన్న త్రిగుణ్‌ని మాత్రం ఎవరూ నామినేట్ చేయకూడదని స్పష్టం చేశారు.

మొదటగా వచ్చిన వంశీ.. ముకేశ్‌ను, ఆ తర్వాత వర్షిణిని నామినేట్ చేశారు. ముకేశ్ మాట్లాడే అభ్యకరమైన మాటలు విని బయటివాళ్లు ఏమనుకుంటారని వంశీ ప్రశ్నించారు. ఇక తొలివారంలో రాంప్రసాద్ విషయంలో హర్ట్ అయిన విషయాన్ని ఇన్ని రోజులు మనసులో పెట్టుకుని ఇప్పుడు బయటపెట్టడం ఏంటని వర్షిణిని నిలదీశారు.

సుధీర్ తన మొదటి నామినేషన్ వంశీకి, రెండో నామినేషన్ అమన్‌కు వేశారు. డబ్బు ముఖ్యమా, పేరు ముఖ్యమా అని వంశీని సుధీర్ ప్రశ్నించారు. అలాగే హోటల్ టాస్క్‌లో ఫ్రెండ్‌షిప్ కోసం స్టార్ ఇచ్చి, నిన్న అతనే వెళ్లిపోవాలని అనడం నచ్చలేదని అమన్ గురించి కారణాలు చెప్పారు.

శ్వేత ముకేశ్‌ను, అమన్‌ను నామినేట్ చేయగా.. నీతూ మాస్టర్ వర్షిణి, వంశీలను నామినేట్ చేశారు. ముకేశ్ మొదటగా వంశీని నామినేట్ చేస్తూ మీ గేమ్ జీరో అని అన్నారు. ఈ సందర్భంగా వంశీ, ముకేశ్‌ల మధ్య 'పోరా మతిమరుపు' అంటూ మాటల యుద్ధం, గొడవ జరిగాయి.

చివరగా ముకేశ్ దేబ్జానీని నామినేట్ చేయగా, రామకృష్ణ ముకేశ్, నీతూలను నామినేట్ చేశారు. నరేశ్ అమన్, వర్షిణిలను నామినేట్ చేయడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది.