వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న కొత్త సినిమా పేరు 'శ్రీ శ్రీ' అని ఖరారైంది. నూతన దర్శకుడు రవి నెలకుదిటి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎస్ఎల్వి సినిమాస్ వారు ఆవిష్కరించారు. ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రం ఉండబోతోందని, దీనికి 'లవ్ విల్ స్పార్క్ అగైన్' అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.

పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఒక కాంపౌండ్ గోడపై కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. పాస్టెల్ బ్లూ షర్ట్, గ్రే ట్రౌజర్, కళ్లద్దాలతో దుల్కర్ సిగ్గుపడుతూ నవ్వుతుండగా, లైట్ బ్లూ సల్వార్ సూట్‌లో ఉన్న పూజా ఆయన వైపు చూసి మనసారా నవ్వుతోంది. వీరి దుస్తులు, హావభావాలు చూస్తుంటే ఇద్దరూ క్లాస్‌మేట్స్‌లా అనిపిస్తూ, స్నేహం నుంచి ప్రేమలోకి మారే అనుబంధాన్ని ఈ చిత్రం చూపించబోతోందని అర్థమవుతోంది.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆయన ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌కు 10వ చిత్రం కావడం విశేషం. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అనయ్ ఓం గోస్వామి కెమెరా అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తుండగా, ఈ సాంకేతిక నిపుణుల బృందం చిత్రాన్ని విజువల్‌గా, ఎమోషనల్‌గా అద్భుతంగా తీర్చిదిద్దుతోంది.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయనున్నారు. గతంలో విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌లో ఈ జంట కెమిస్ట్రీ ఆకట్టుకోగా, తాజా పోస్టర్ కూడా ప్రేక్షకులకు పాజిటివ్ వైబ్స్‌ను పంచుతోంది.