దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'డీసీ' (DC The Bloody Valentine). 'రాకీ', 'సాని కాయిదం', 'కెప్టెన్ మిల్లర్' చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. "తప్పు చేస్తే దండించడానికి పోలీసులు వస్తారు... కానీ పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడగాలి?" అనే సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. దేవదాస్ పాత్రలో లోకేశ్ కనగరాజ్, చంద్ర పాత్రలో వామికా గబ్బీ నటించారు. ఒక పోలీసు హత్య, దొంగిలించిన ఆయుధాలు, ప్రేమ, ద్రోహం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రంలో సంజనా కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, ముకేష్ జీ సినిమాటోగ్రఫీ, జి.కె. ప్రసన్న ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అరుణ్ మాథేశ్వరన్, ఫ్రాంక్లిన్ జేకబ్ కలిసి సంభాషణలు రాయగా, అరుణ్ రంజన్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తర భారతంలో ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేయనుంది. దర్శకుడిగా వరుస విజయాలు అందుకున్న లోకేశ్ కనగరాజ్, హీరోగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.