తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు తలుపులు తెరవాలని కేంద్రమంత్రి జేపీ నడ్డా రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేరే పార్టీలకు చెందిన వారిని కలుపుకుంటేనే పార్టీ మరింత బలపడుతుందని స్పష్టం చేశారు.

విభేదాలను పక్కన పెట్టి పరస్పర సహకారంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని నడ్డా కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, దీంతో ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తమకు సమాచారం ఉందని తెలిపారు. అయితే, కేవలం ప్రతిపక్షాల వ్యతిరేకతపై ఆధారపడకుండా, సొంతంగా గెలుపు కోసం ఏం చేస్తున్నామనే దానిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉంచుకోవాలని, లేకపోతే నాయకులు ప్రజల నుంచి డిస్‌కనెక్ట్ అవుతారని నడ్డా హెచ్చరించారు. అవినీతికి పాల్పడను, ఇంకొకరిని అవినీతి చేయనివ్వను అన్న ప్రధాని మోదీ సూత్రాన్ని అనుసరించాలని, లీడర్ల వెంట తిరిగినంత మాత్రాన లీడర్లు కాలేరని గుర్తుచేశారు. ఇప్పటికే ఒకసారి బస్సు మిస్సయిందని, ఇంకోసారి అవకాశం కోల్పోవద్దని ఆయన నేతలకు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని, ఈ ప్రభుత్వం కొనసాగాలా లేదా అన్నది ప్రజలే నిర్ణయించాలని నడ్డా పిలుపునిచ్చారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, ఎంపీ డా.కె.లక్ష్మణ్, పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.