బెంగళూరులోని ఓ ప్లేస్కూల్ (కిండర్‌గార్టెన్)లో టీచర్ ఉద్యోగానికి నెలకు కేవలం రూ.6వేలు జీతం ఆఫర్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒక వైపు విద్యా సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండగా, పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు మాత్రం ఇంత తక్కువ మొత్తం ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ విషయం ఎక్స్ (ట్విటర్) వేదికగా వెలుగులోకి వచ్చింది. తన మరదలికి ఆ స్కూల్‌లో ఉద్యోగం వచ్చిందని, కానీ జీతం మాత్రం రూ.6వేలే ఇస్తున్నారని ఒక వ్యక్తి పోస్ట్ చేశారు. మెట్రో నగరంలో ఈ మొత్తంతో జీవించడం సాధ్యం కాదని, స్కూల్ ఫీజులు పెరుగుతున్నా టీచర్ల జీతాలు మాత్రం కుంగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తమ ఇంట్లో పనిచేసే పనిమనిషికి కూడా ఇంతకంటే ఎక్కువ జీతం ఇస్తున్నామని ఒకరు కామెంట్ చేశారు. మరో వ్యక్తి, భారత్‌లో నర్సులు కూడా రూ.10వేల నుంచి రూ.15వేల మధ్యే సంపాదిస్తున్నారని, అందుకే చాలా మంది విదేశాలకు వెళ్తున్నారని గుర్తుచేశారు. డెలివరీ ఉద్యోగులకే రూ.18వేల నుంచి రూ.20వేలు ఇస్తున్న కంపెనీలు ఉండగా, టీచర్‌కు రూ.6వేలు ఇవ్వడం బాధాకరమని, అలాంటి ఆఫర్‌ను అంగీకరించకూడదని మరికొందరు సూచించారు.
అద్దె, కరెంట్ బిల్లు, కూరగాయలు, పిల్లల చదువు అన్నీ చూసుకుని, మిగిలిన డబ్బుతో బయట భోజనం కూడా చేయొచ్చని ఆ స్కూల్ యాజమాన్యం భావిస్తుందేమోనని ఒకరు సెటైరికల్‌గా స్పందించారు. మంచి విద్య అందించే వారి జీవితం ఇంత కష్టంగా ఉంటే, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.








