ఖమ్మం నగరంలోని సుందరయ్య భవనంలో బుధవారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు పూర్తయితేనే రైతులకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎల్‌ నినో ప్రభావంతో వర్షాల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పత్తి, వరి నార్లు వేసిన రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, నేత పోతినేని సుదర్శన్‌తో పాటు కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు కోరారు.