తెలంగాణలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీజన్‌లో మొత్తం 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సుమారు రూ.18,250 కోట్ల వ్యయంతో సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం 8283 కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందులో 3180 ఐకేపీ (ఇందిరా క్రాంతి పథకం) కేంద్రాలు, 4372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, 731 ఇతర కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్ 1 నాటికే ఈ కేంద్రాలన్నింటినీ సిద్ధం చేయాలని ప్రభుత్వం గడువు విధించింది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా గోదాములు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు, హమాలీలు, తూకం యంత్రాలు, నాణ్యతను పరీక్షించే పరికరాలను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ధాన్యం సేకరించిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్‌కు రూ.2461, సాధారణ రకానికి రూ.2441 చెల్లించనున్నారు. వీటితో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకం ధాన్యాలకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించనున్నారు. బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, కేఎన్‌ఎం-1638, జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ-సోనా, డబ్ల్యూజీఎల్‌-44, కేఎన్‌ఎం-7715 రకాలకు ఈ బోనస్ వర్తిస్తుంది.

సన్న రకం ధాన్యానికి బోనస్ పొందాలంటే రైతులు విత్తనాలు కొనేటప్పుడే డీలర్ల వద్ద రకాన్ని నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ధాన్యం సేకరణ ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలను వెల్లడించారు.